Telangana Police Recruitment Update

40

తెలంగాణ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు తీపి కబురు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దగా ఆసక్తి కనబర్చలేదనే చెప్పాలి. అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో దశాబ్దాల కాలంగా ఉద్యోగాల భర్తీకి నోచుకోని శాఖలు సైతం కొద్దోగోప్పో ఉద్యోగులతో నిండుకునేందుకు సిద్ధమయ్యాయి. మొత్తంగా సీఎం కేసీఆర్ ప్రకటనతో తెలంగాణలో త్వరలో కొలువుల జాతర మొదలవనుంది. ఒకే సారి 50వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అందుకోసం సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. ఉపాధ్యాయ, పోలీస్‌ శాఖలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులంన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్‌లను విడుదల చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా సీఎస్ సోమేష్ కుమార్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50వేల వరకు ఖాళీలున్నట్టు అంచనా వేశారు. ప్రదానంగా వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్‌మెంట్ జరగాల్సి ఉంది. ఈ రెండు శాఖలతో పాటు ఇతర శాఖల్లోని ఖాళీల వివరాలు వెంటనే నివేదిక రూపంలో అందజేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇంకా ఏ ఏ శాఖల్లో ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలని సీఎం తెలిపారు. ఇలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్‌లు విడుడల చేయాలని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకస్మిక ఉద్యోగాల ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రెండు మూడు సార్లు ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేసి.. ఆ తర్వాత పట్టించుకోని వైనాన్ని జనం గుర్తు చేస్తున్నారు. ఇక రాజకీయ వర్గాల్లో మాత్రం కేవలం ఇది ఖమ్మం, వరంగల్‌ కార్పోరేషన్, ఎమ్మెల్సీ ఎన్నికల స్టంట్‌గా అభివర్ణిస్తున్నారు. బీజేపీ విస్తరించకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకున్నట్లుగా అనిపిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాజకీయం విషయం పక్కన పెడితే సీఎం కేసీఆర్‌
తీసుకున్న నిర్ణయాన్ని నిరుద్యోగులు స్వాగతిస్తున్నారు.